దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం...
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
–ప్రతి రైతుకు భూ భద్రత కల్పించడమే లక్ష్యంగా భూ భారతి చట్టం
–నేలకొండపల్లి మండలం, సుర్దేపల్లి గ్రామంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మంగళవారం మంత్రివర్యులు నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భూ భారతి చట్టం - 2025 పై నిర్వహించిన రైతు సదస్సులో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి, మేధావులతో చర్చించి పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. చట్టాన్ని రూపొందించే ముందు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాన్ని రూపొందించామని అన్నారు.
గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి 3 సంవత్సరాలు గడిచిన రూల్స్ తీసుకుని రాలేదని, తమ ప్రభుత్వం భూ భారతి చట్టం రూల్స్ ప్రవేశపెట్టిందని, ఈ నిబంధనల ప్రకారం సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు. నేలకొండపల్లి మండలంలో 23 రెవెన్యూ గ్రామాలలో నేటికీ 20 గ్రామాలో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని, రేపు మరో 3 బృందాలు 3 గ్రామాలలో పర్యటిస్తాయని , ఇప్పటివరకు సుమారు 2380 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
మండలంలో ఎక్కువగా పెండింగ్ ఉన్న సాదా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా ఊసే అసలు లేదని అన్నారు.
తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూ భారతి చట్టంతో ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని, ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాలలో ఎటువంటి భూ సమస్య ఉన్న అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు.
కోర్టులో లేని ప్రతి భూ సమస్య పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 6 వేల మంది ప్రైవేటు సర్వేయర్లను మరో 15 రోజులలో శిక్షణ ఇచ్చి, మండలాలకు ఇవ్వనున్నామని, 1000 మంది ప్రభుత్వ సర్వేయర్లను నియమించనున్నామని మంత్రి తెలిపారు. మ్యాప్ పై సర్వే సంతకంతో కంప్యూటర్ లో అప్ లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరిగేలా వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో మనస్సాక్షిగా పేదవారికి మేలు చేయాలని అద్భుతమైన ఈ చట్టాన్ని చేసుకున్నామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ ల సమావేశం నిర్వహించి భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారని, మొదటగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్టు క్రింద తీసుకున్నామని, జూన్-2 లోపు ఎంపిక చేసిన 4 పైలెట్ గ్రామాల భూ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక్కో మండలానికి ఇదే తరహాలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులు రైతుల వద్దకు వస్తారని, రైతుకు ఎటువంటి సమస్య లేకుండా పూర్తి భద్రత కల్పిస్తామన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ వినియోగించు కోవాలని అన్నారు. భూ హక్కులు ఉన్న రైతులకు న్యాయం జరిగేలా తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం అమలు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ధరణి స్థానంలో సరళమైన భూ భారతి పోర్టల్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. భూమి స్వభావం, కొలతలు, ఎక్కడ ఉంది తేలితేనే భూ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని, వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ తెలిపారు.
1910 - 1930 మధ్య నైజాం కాలంలో భూ సర్వే జరిగాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారం సర్వేతోనే సాధ్యం అవుతుందని, భూ సర్వే ను భూ భారతి చట్టంలో పొందు పర్చడం జరిగిందని అన్నారు. జి.పి.ఎస్ సాంకేతికతో కూడిన యంత్రాలతో సర్వే చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి సర్వేయర్లను కేటాయించి సర్వే పూర్తి చేస్తామని, మండలంలో సర్వేయర్ సర్వే సరిగా జరిగినట్లు ధ్రువీకరణ జరుపుతారని అన్నారు.
భూమి కొలతలు, ఎక్కడ ఉందో తెలిసిన తర్వాత యాజమాన్య హక్కు తేల్చాల్సి ఉంటుందని అన్నారు. సాధా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించి పట్టాలు అందించేందుకు భూ భారతి చట్టంలో సౌలభ్యం కల్పించామని అన్నారు.
వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసే ముందు తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరికీ నోటీసులు జారీ చేయాలని, తర్వాత మాత్రమే భూ హక్కుల బదలాయింపు జరగాలని కొత్త చట్టంలో చేర్చుకున్నామని, దీని వల్ల వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అన్నారు.
భూ హక్కుల రికార్డుల్లో తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునేందుకు గతంలో సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, భూ భారతి చట్టం ప్రకారం రెవెన్యూ కోర్టులలో పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నిర్దేశిత సమయంలో ప్రజలకు సేవలు అందేలా చట్టంలో అధికారులపై బాధ్యత పెట్టడం జరిగిందని అన్నారు. భూ హక్కుల రికార్డు మ్యూటేషన్ దరఖాస్తులను 30 రోజుల లోగా పూర్తి చేయాలని, చేయని పక్షంలో దరఖాస్తు ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతుందని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భూ సమస్యల పరిష్కారం, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని, ఇవి రెండు అంశాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతున్నదని తెలిపారు.
భూ సమస్యలపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన తమ చేతిలో లేదని ఆనాడు పరిష్కరించ లేకపోయామని, ఏ సమస్య పరిష్కారం ఉన్న కోర్టుకు వెళ్లాలని కాలయాపన చేసేవారని, నేడు తమ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు భూ భారతి చట్టం ప్రవేశపెట్టి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం రైతు సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు తమ భూ సమస్యలను రెవెన్యూ శాఖ మంత్రి పరిష్కరించాలని కోరారు. తమ ఆధీనంలో ఉన్న భూమికి పట్టాలు లేవని, సీలింగ్ భూములు పంపిణీ, సాదా బైనామా భూముల పరిష్కారం, వారసత్వ భూముల వివాదాల పరిష్కారం కోరుతూ రైతులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహారావు, ఏడి అగ్రికల్చర్ సరిత, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments