కొత్త సీసాలో పాత సారా లాగా కెసిఆర్ స్పీచ్
కేసీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ కౌంటర్
హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు.
“కేసీఆర్ స్పీచ్ కొత్త సీసాలో పాత సారా లాగాఉసూరుమనిపించింది. స్వయంస్తుతి, పరనింద తప్ప కొత్తదనం ఏమి లేదు,” అని ఆయన విమర్శించారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ,
“రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రెచ్చిపోవడానికి సిద్ధంగా లేరు. నిన్న భారత్ సమ్మిట్‌లో ‘హైదరాబాద్ రిజల్యూషన్’కు వచ్చిన స్పందన చూసి మీరు తడబడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని అంతర్జాతీయంగా ప్రశంసిస్తుంటే మీకూ, మీ నాయకత్వానికీ అసూయ తప్ప కనిపించడంలేదు,” అని వ్యాఖ్యానించారు.
“మీ స్పీచ్ కోసం ఎడ్ల బండ్లు తిరగబెట్టిన మీ పార్టీ నాయకుల పతనం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ముంచిన సత్యాన్ని తెలంగాణ ప్రజలు మరచిపోలేదు. ఏడు లక్షల కోట్లు అప్పుచేసిన విషయాన్ని మీరే మర్చిపోయారు కాని ప్రజలు మరువలేదు,” అని మండిపడ్డారు.
“రాష్ట్రాన్ని ఓ గతిపాలుగా మార్చిన తర్వాత, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సంరక్షిస్తున్నాడు. మేము రైతు ఋణమాఫీ, ఉచిత కరెంట్, ఉచిత బస్, ఉచిత గ్యాస్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాము. ఇవి మీ కళ్ళకు కనిపించట్లేదా?” అని ప్రశ్నించారు.
అద్దంకి దయాకర్ సవాల్ చేస్తూ,
“మీకు ధైర్యం ఉంటే ఉచిత బస్, ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పై బహిరంగంగా రెజల్యూషన్ చేయండి,” అని చెప్పారు.
“బీసీలకు రాజ్యాంగ హక్కులు కల్పించేందుకు బీసీ బిల్లు తెచ్చాము. ఎస్సీల వర్గీకరణ కోసం కృషి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని విధంగా భారతదేశ చరిత్రలో తొలిసారి సన్నబియ్యం అందిస్తున్నాం,” అని చెప్పారు.
“52 వేల ఉద్యోగాలు భర్తీ చేశాము, ఇంకొన్ని నెలల్లో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నాం. మీ సోషల్ మీడియా వాదనలతో కాదు, ప్రజల గుండెల గమనంతో మేము ముందుకు సాగుతున్నాం,” అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
“చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. మీ పార్టీ ఎలా నిద్రపోయిందో ప్రజలకు తెలుసు,” అని అన్నారు.
“తెలంగాణ ప్రజల అవసరాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ మీ పార్టీని బ్రతికించుకోవడానికి మీరు బీజేపీని తిట్టడమే మిగిలింది,” అని దయాకర్ విమర్శించారు.
Comments