వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు శ్రీకారం
శృంగేరి పీఠాధిపతి అనుమతితో త్వరలో ప్రారంభం
వేములవాడ, తెలంగాణ ముచ్చట్లు:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామి అనుమతితో శ్రీకారం చుట్టనున్నారు. దీనిని ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
ఆదివారం ఆయనతో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ లు కలిసి శృంగేరి పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆలయ విస్తరణపై విపులంగా చర్చించారు. ఆలయ నమూనాలను పరిశీలించిన పీఠాధిపతి, అభివృద్ధి పనులు పురోగమించేందుకు అనుమతిస్తూ సూచనలు చేశారు.
ఇందుకు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, సీఎంఓ ఓఎస్డీ శ్రీనివాసులు, ఆది శ్రీనివాస్ రెండు సార్లు శృంగేరి పీఠాన్ని సందర్శించి అనుమతులు తీసుకున్నారు. అనంతరం విజయవాడలో మరోసారి దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పీఠాధిపతిని కలసి ఆలయ అభివృద్ధి ప్రతిపాదనలపై సమగ్ర చర్చ జరిపారు.
గత నవంబర్ 20న వేములవాడ ఆలయ అభివృద్ధి విస్తరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలో కార్యక్రమం జరిగింది.
ప్రస్తుతం ఆలయ విస్తరణకు సంబంధించిన టెండర్లు, నమూనాలు తుది దశలో ఉన్నాయి. ప్రతి అభివృద్ధి పనిని క్షుణ్ణంగా పరిశీలించి, పీఠాధిపతి ఆమోదంతో ముందుకు సాగనున్నారు.విస్తరణ పనులు కొనసాగినంతకాలం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం జరిపే చతుస్కాల పూజలు, మహనివేదన, నిత్య పూజా కార్యక్రమాలు అర్చక బృందం ద్వారా యథావిధిగా ఏకాంతంగా నిర్వహించబడతాయి. భక్తుల సౌకర్యార్థం, భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా ఆర్జిత సేవలు కొనసాగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ సలహాదారు గోవిందా హరి, ఆర్&బి సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, అర్చకులు శరత్, సురేష్, శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ శర్మ, ఏఈ రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments