వేములవాడలో అత్యాధునిక నిత్య అన్నదాన సత్రం నిర్మాణం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కొల్లూరు, తెలంగాణ ముచ్చట్లు:
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యాధునిక సదుపాయాలతో నిత్య అన్నదాన సత్రం నిర్మాణం చేపట్టినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.సోమవారం శృంగేరి పర్యటనలో భాగంగా కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసే అన్నదాన సత్రం, క్యూ లైన్ల నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు.
గత సంవత్సరం నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మంత్రి పోన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన అభివృద్ధి విస్తరణలో భాగంగా రూ.35 కోట్ల వ్యయంతో నిత్య అన్నదాన సత్ర నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్య దృష్ట్యా, తిరుమల శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం నమూనాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇప్పటికే అన్నదాన సత్రం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయి, పనులు త్వరలో ప్రారంభమవనున్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ కొల్లూరులో వంటశాల, డైనింగ్ హాల్, క్యూ లైన్ల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, అర్చకులు శరత్, సురేష్, శర్మ, ఏఈ రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments