సిగ్నల్ కష్టాలకు చెక్..

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సరికొత్త లక్ష్యం

సిగ్నల్ కష్టాలకు చెక్..

* ​మారుమూల పల్లెల్లో నెట్‌వర్క్ విప్లవానికి నాంది
* ​కేంద్ర టెలికాం శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి 
* ​మూడు జిల్లాల్లో 25 కొత్త బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదన

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 27(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న మొబైల్ నెట్‌వర్క్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఖమ్మం ఎంపీ, కమ్యూనికేషన్స్, ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యులైన  రామసహాయం రఘురాం రెడ్డి నడుం బిగించారు. ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ప్రతి పల్లెకు హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరాలనే లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా 25 కొత్త బీఎస్ఎన్ఎల్ (4జి /5జీ ) టవర్లను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర టెలికాం కార్యదర్శి అమిత్ అగర్వాల్ ను సోమవారం ఢిల్లీ లో కలిసి విన్నవించారు. ఈ మేరకు అవసరమైన ప్రాంతాల పూర్తి వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి అందజేశారు.
*మారుమూల పల్లెల్లో కమ్యూనికేషన్ కరువు*
నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాలు, ఎల్‌డబ్ల్యూఈ (మావోయిస్టు ప్రభావిత) ప్రాంతాలు మరియు సరిహద్దు గ్రామాల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ సేవలు పొందే సామాన్యులకు ఈ నెట్‌వర్క్‌ సమస్య పెద్ద అడ్డంకిగా మారిందని వివరించారు. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో ఉంచుకుని, తక్షణమే టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
*​25 గ్రామాల్లో కొత్త టవర్ల కోసం ప్రతిపాదన*
నియోజకవర్గ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంతో పాటు సరిహద్దు జిల్లా అయిన మహబూబాబాద్ ను కలిపుకొని మొత్తం 25 సమస్యాత్మక ప్రాంతాల జాబితాను ఎంపీ అందజేశారు.
*​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:* అశ్వారావుపేట మండలంలోని కొత్త కన్నాయిగూడెం, కాంట్లం, చెన్నపురం, పాల్వంచ మండలంలోని మందారికాలపాడు, కారేగట్టు, సారెకల్లు, మొండికట్ట, రెడ్డిగూడెం, ములకలపల్లి మండలంలోని పాత గుండాలపాడు, గండిప్రోలు గ్రామాల్లో టవర్లు అవసరమని పేర్కొన్నారు.
*​ఖమ్మం జిల్లా:* ఖమ్మం రూరల్ (కస్నా తండా), మధిర (నిధానపురం), ముదిగొండ (పమ్మి), కల్లూరు (వెన్నవల్లి), బోనకల్ (గోవిందాపురం ఎల్), ఎన్కూర్ (జన్నారం), వైరా (రెబ్బవరం), చింతకాని (నేరడ), రఘునాథపాలెం (పంగిడి), పెనుబల్లి (టేకులపల్లి) ప్రాంతాలను ప్రతిపాదించారు.
*​మహబూబాబాద్ జిల్లా:* బయ్యారం మండలంలోని మిర్యాలపెంట, కొయ్యగూడెం, తిమ్మపురం, వెంకటాపురం, జగత్రావుపేట గ్రామాల్లో నెట్‌వర్క్‌ సౌకర్యం కల్పించాలని కోరారు.
​ఈ ప్రాంతాల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వస్తే గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు పడతాయని ఎంపీ రఘురాం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన టెలికాం కార్యదర్శి... రాష్ట్ర టెలికాం అడిషనల్ డీజీతో మాట్లాడి ఎంపీ సూచించిన 25 టవర్ల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News