ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు: సిపిఎం

ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు: సిపిఎం

సత్తుపల్లి, ఏప్రిల్ 25(తెలంగాణ ముచ్చట్లు):
 
ప్రచార ప్రకటనల కోసమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ ఆరోపించారు. మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రాలలో గన్నీ సంచులు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు వంటి మౌలిక వసతులు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. టెంట్ తప్ప మరే ఏర్పాట్లు కనిపించడం లేదని విమర్శించారు. గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులు 15–20 రోజులుగా వరి ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారపెట్టి రాశులుగా నిల్వ ఉంచుతున్నారని తెలిపారు. గోనె బస్తాల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. ఒక్క కాకర్లపల్లి గ్రామంలోనే సుమారు 15 లారీలకు సరిపడా వరి ధాన్యం రాశులుగా పోసి పట్టాలు కప్పి ఉంచినట్టు చెప్పారు. తేమ, తాలు పేరుతో రైతులను మోసం చేయకుండా అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సన్న, మోటా రకం ధాన్యాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, బెజవాడ లక్ష్మీనారాయణ, కొప్పుల చిన్నస్వామి, రైతులు దొడ్డా సత్యం, గోట్ల శ్రీమన్నారాయణ, మోరంపూడి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .