ఆత్మబలిదానాలు వద్దు .
జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం
హక్కుల కోసం పోరాటం చేద్దాం…
– ఆర్టీసీ కార్మికులకు దళిత హక్కుల పోరాట సమితి మద్దతు
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కొనసాగుతున్న ఆందోళనకు హనుమకొండ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజారపు రత్నం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ, కార్మికులు హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
“ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడదాం… కార్మికుల పొట్ట కొట్టే విధానాలను ప్రశ్నిద్దాం. కానీ ప్రాణత్యాగం సమస్యకు పరిష్కారం కాదు. మీ ప్రాణం అమూల్యమైనది. మీరు కోల్పోతే నష్టపోయేది మీ కుటుంబమే తప్ప ప్రభుత్వం కాదు” అని ఆవేదనతో తెలిపారు.
ఆర్టీసీ కార్మికులారా… ఆవేదనలో ఆత్మహత్య శరణ్యం అనుకోకండి. మీరు గతంలో ఎన్నో హక్కులు సాధించారు. మీ వెనుక మీ కుటుంబం ఉంది… మీకు అండగా మేమున్నాము. న్యాయమైన డిమాండ్ల కోసం మీరు చేస్తున్న పోరాటంలో మేము మీ వెంటే ఉంటాం. ప్రభుత్వం దిగివచ్చి మీ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, న్యాయం జరగకపోవడంతో ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా డిమాండ్ల పరిష్కారంలో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. జేఏసీ నాయకులతో వెంటనే చర్చలు జరిపి, కాలయాపన చేయకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
“ధైర్యంగా ఉండండి… కలిసి పోరాడుదాం” అని కార్మికులకు పిలుపునిచ్చారు.


Comments