నిలిచిపోయిన సన్న బియ్యం సేకరణ!
64 మిల్లుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ
నెల రోజులుగా నిలిచిన తరలింపు..
నాణ్యత దెబ్బతింటుందని మిల్లర్ల ఆందోళన
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లాలో సన్న బియ్యం సేకరణ నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని 64 మిల్లుల్లో సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉండిపోయినట్లు తెలుస్తోంది. నెల రోజులుగా బియ్యం తరలింపు జరగకపోవడంతో వాటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, దీనివల్ల లక్షల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.బఫర్ గోదాములకు బియ్యం తరలించేందుకు అనుమతులు లభించకపోవడంతో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం మిల్లర్లు జిల్లా కలెక్టర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించినట్లు సమాచారం.
బియ్యం నిల్వలు పేరుకుపోతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిల్లర్లు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి బియ్యం తరలింపునకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు సన్న బియ్యం సేకరణ ప్రక్రియను త్వరగా పునరుద్ధరించాలని వారు కోరుతున్నట్లు సమాచారం.


Comments