కరుణాపురంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.
సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సంబరాలు.
ధర్మసాగర్,అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహిళలు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి సంప్రదాయ వేడుకలు గ్రామీణ సంస్కృతిని పరిరక్షించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.గ్రామంలో బతుకమ్మ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సహకరించిన మహిళలకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలతో కరుణాపురంగ్రామంలో పండుగ సందడి నెలకొంది.


Comments