కోర్టు ఆదేశాలున్నా దాడి..!
*మూగ పిల్లల తల్లిపై కర్రలతో దాడి.. చంపేస్తామని బెదిరింపులు*
*భూమి వివాదంలో ఒంటరి మహిళకు తీవ్ర గాయాలు*
సైదాపూర్, అక్టోబర్ 9(తెలంగాణ ముచ్చట్లు ):
ఇద్దరు దివ్యాంగ పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ ఒంటరి మహిళపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన ఘటన సైదాపూర్ మండలంలో కలకలం రేపింది. వ్యవసాయ భూమికి సంబంధించి కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు భూమిలోకి చొరబడి తనపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు బజ్జూరి తిరుమల ఆరోపించారు. తనను, తన ఇద్దరు పిల్లలను చంపేస్తామని బెదిరించారని పేర్కొంటూ సైదాపూర్ పోలీసులను ఆశ్రయించారు.
భూమి వివాదమే కారణమా?
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన బజ్జూరి తిరుమలకు వ్యవసాయ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించి కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ బండి రమేశ్, బండి సారయ్య, ఎలబోయిన కొమురయ్య, బండి వనమ్మలు ఉద్దేశపూర్వకంగా తన వ్యవసాయ భూమిలోకి చొరబడ్డారని ఆరోపించారు.
కర్రలతో విచక్షణారహితంగా దాడి
ఉదయం సమయంలో తాను బావి వద్దకు వెళ్లగా, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు కర్రలతో తనపై దాడి చేశారని తిరుమల తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తగాయాలయ్యాయని పేర్కొన్నారు. అదే సమయంలో కౌలు రైతు అంకూస్ అక్కడికి రావడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారైనట్లు బాధితురాలు వెల్లడించారు.
పిల్లలను చంపేస్తామని బెదిరింపులు
దాడి చేసిన వారు వెళ్తూ తన మాట వినకపోతే తనతో పాటు తన ఇద్దరు దివ్యాంగ పిల్లలను కూడా చంపేస్తామని బెదిరించినట్లు ఆమె ఆరోపించారు. భర్త లేని తనకు ఇద్దరు పిల్లలే ప్రపంచమని, వారిని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నానని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమలను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం తనపై దాడికి పాల్పడిన వారిపై సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ తనకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరారు. తనకు, తన పిల్లలకు ప్రాణరక్షణ కల్పించి, వ్యవసాయ భూమి విషయంలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై పోలీసుల విచారణ, అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.


Comments