లో వోల్టేజీతో కాలిపోతున్న వ్యవసాయ మోటార్లు.
* విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పంటలు.. రైతుల ఆవేదన
* గతంలో మాదిరిగా 18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
* రైతు ఏనుగు గోపాల్ రెడ్డి
ఇల్లందకుంట, అక్టోబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
తక్కువ వోల్టేజీ, విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలతో వ్యవసాయ మోటార్లు కాలిపోతుండగా, సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, అధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని గ్రామానికి చెందిన రైతు ఏనుగు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలు చివరి దశలో ఉన్నాయని, ఈ సమయంలో సకాలంలో నీరు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో రోజుకు పది గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, సరఫరా అయిన సమయంలోనూ తక్కువ వోల్టేజీ కారణంగా వ్యవసాయ బావుల నుంచి పొలాలకు నీరు అందించలేకపోతున్నామని తెలిపారు. దీంతో వరి పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్కువ వోల్టేజీతో వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోతున్నాయని, వాటి మరమ్మతులు, కొత్త మోటార్ల ఏర్పాటుతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టిన రైతులు, పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలతో మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
గతంలో రోజుకు 18 గంటలపాటు విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం ఆ స్థాయిలో సరఫరా లేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గోపాల్ రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగా రోజుకు 18 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి మర్రివానిపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించాలని, తగిన వోల్టేజీతో అంతరాయాలు లేకుండా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంటలు చేతికొచ్చే వరకు రైతులకు నిరంతరాయంగా సాగునీరు అందే పరిస్థితులు కల్పించాలని కోరారు.



Comments