గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
*గల్ఫ్ బాధితులకు అండగా ఉంటా.*
*విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తా*
*‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ*
కరీంనగర్, అక్టోబర్ 10(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించి గల్ఫ్ కార్మికులు, విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజుల సంపత్ కుమార్, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ బృందం ఆయనకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ (చొక్కాలపల్లె)కు చెందిన చొక్కాల శ్రీధర్ అదృశ్యమైన కేసుపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు కార్మికులు కంపెనీలు విధించిన జరిమానాలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆయన, వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఒమన్‌లో కంపెనీలు విధించిన మొత్తాలను చెల్లించలేక ఎంబసీ షెల్టర్‌లో ఉంటున్న కార్మికులను కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
బోధన్ నుంచి రష్యాకు వెళ్లిన కొందరిని అక్కడ సైనిక సేవలో చేర్చుకున్నారని, వారు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నప్పటికీ అక్కడి అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని సురక్షితంగా ఇంటికి రప్పించాలని వారు వేడుకుంటున్న నేపథ్యంలో, ఈ తరహా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చర్చించారు.
అనంతరం సీఎం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి కె. విద్యాసాగర్, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంద భీంరెడ్డి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి గల్ఫ్ వలసలు, ఎన్నారై వ్యవహారాలు, బాధితుల ఫిర్యాదుల పరిష్కార మార్గాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెన్నమనేని శ్రీనివాస్ రావు, స్వదేశ్ ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి, మలేషియా సేవా కార్యకర్త రంజిత్, దేవేందర్, గల్ఫ్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.


Comments