మత్తుల వాగుపై వంతెన నిర్మించాలి.
రత్నతండ వాసుల వినతి.
చిల్పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రత్నతండకు వెళ్లే మార్గంలో మత్తుల వాగుపై వంతెన నిర్మించాలని తండా వాసులు కోరారు. తండాలో 13 గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు 40 మంది నివసిస్తుండగా, ప్రతిరోజూ పొలాలకు వెళ్లే సుమారు 50 మంది రైతులు ఇదే మార్గంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు.
తండాకు వెళ్లే దారిలో మత్తుల వాగు అడ్డంగా ఉండటంతో వాగు దాటేందుకు రహదారి, కల్వర్టు, వంతెన వంటి సౌకర్యాలు లేక రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు విద్యార్థులు, రోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అత్యవసర సమయాల్లో తండాకు రాకపోకలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.
సమస్యను పరిష్కరించేందుకు మత్తుల వాగుపై వంతెన మంజూరు చేయాలని కోరుతూ సోమవారం తండా వాసులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కత్తి పండ్, బానోత్ గణేష్, అపారదాపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments