రూ.50 వేలు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపణ.
ఇప్పగూడెం బాధితులకు వెంటనే న్యాయం చేయాలి
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఇప్పగూడెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కోలిపాక వెంకటయ్య–వెంకటమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారని తెలిపారు. అనంతరం ఇల్లు రాదని చెప్పడంతో వారు ఉన్న ఇంటిని కూల్చుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సోమవారం తాటికొండ రాజయ్య 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరగడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తాటికొండ రాజయ్య విమర్శించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.50 వేలు ఇచ్చిన వారికే దళారుల ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు, ఎవరెవరికి మంజూరు చేశారనే వివరాలను బహిర్గతం చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇప్పగూడెం గ్రామాన్ని సందర్శించి సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన నిరుపేదలకు త్వరితగతిన ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, నాయకులు సట్ల యాకయ్య, కనకం గణేష్, చల్లా చందర్ రెడ్డి, గుండె
మల్లేష్, బొంకూరి మహేష్, మహి పాషా, ఒగ్గు రాజు, గాదె రాజు, వారాల రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments