రైతులకు కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.
24 గంటల విద్యుత్ కోసం జగదీశ్వర్ రెడ్డి డిమాండ్.
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పెద్దమందడి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విద్యుత్ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో కరెంట్ అందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా తప్పనిసరి అని అన్నారు. విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేసి రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించాలని డిమాండ్ చేశారు.మండలంలోని వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరచి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ మరింత బలంగా పోరాటం చేస్తుందని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు మండల విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments