కవి కందూరు నారాయణరెడ్డికి ఘన సన్మానం.
తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు విశేష సేవలు.
వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
కవి, తెలుగు భాషా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కందూరు నారాయణరెడ్డిని సోమవారం కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు ఘనంగా సన్మానించారు. వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో రేడియంట్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కారం చేశారు.ఈ సందర్భంగా కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు భాషోపాధ్యాయుడిగా సేవలందించిన నారాయణరెడ్డి, పదవీ విరమణ అనంతరం కూడా తెలుగు భాష, సాహిత్య రంగాలకు విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు. చరిత్ర, సాహిత్య రంగాల్లో పరిశోధనలు చేస్తున్న వారికి ఆర్థికంగా సైతం అండగా నిలుస్తున్నారని తెలిపారు.ఆరు దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు వివిధ అంశాలపై వ్యాసాలు, కవితలు రచించారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ కొత్త తెలంగాణ చరిత్రబృందం జిల్లా కన్వీనర్ డా. బైరోజు శ్యాం సుందర్ సన్మానం నిర్వహించారు.కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు దేశి రాములు యాదవ్, బైరోజు చంద్రశేఖర్, బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, రమేశ్, శైలజ, మైత్రీ తదితరులు పాల్గొన్నారు.


Comments