అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్,
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇటీవల పత్రికల్లో కథనాలు వెలువడినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నాంపల్లి మమత గురుకుల పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారు.
విద్యార్థులకు అందుతున్న ఆహారం నాణ్యత, అల్పాహారం అందించే సమయపాలన, పరిశుభ్రత తదితర అంశాలను తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయకులకు గురుకుల ప్రిన్సిపాల్ నుంచి సరైన స్పందన లభించలేదని వారు ఆరోపించారు. హెడ్ ఆఫీస్ పర్మిషన్ కావాలంటూ పాఠశాలలోకి అనుమతించకుండా వెనక్కి పంపించారని తెలిపారు.
పత్రికల్లో విద్యార్థుల సమస్యలపై కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుతో ముడిపడిన సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. “అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?” అని ప్రశ్నించారు.
గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వంట సిబ్బంది పనితీరు, వంటశాల పరిశుభ్రత, అల్పాహారం–భోజన నాణ్యత, టెండర్ల కేటాయింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు వెంటనే గురుకులాన్ని పరిశీలించాలని కోరారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


Comments