గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి.!
- మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.
- డీజేలకు అనుమతి లేదు.. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
- ముందస్తు జాగ్రత్తలపై నిర్వాహకులకు అవగాహన.
- ఏసీపీ వసుంధరా యాదవ్.
సత్తుపల్లి, సెప్టెంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్లూరు ఏసీపీ వసుంధరా యాదవ్ సూచించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని కోరారు. శుక్రవారం సత్తుపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్‌ను నిర్వాహకులకు అందజేశారు. మండపాల ఏర్పాటు, విగ్రహ ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, ఊరేగింపు, నిమజ్జనం తదితర కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికతో నిర్వహించాలని ఏసీపీ సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. ప్రైవేటు స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే స్థల యజమాని నుంచి ఎలాంటి అభ్యంతరం లేదనే ధ్రువీకరణ పత్రం పొందాలని చెప్పారు. రహదారులు, ప్రధాన రహదారులు, అధిక ట్రాఫిక్ ఉండే ప్రాంతాలు, వివాదాస్పద స్థలాల్లో మండపాలను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించుకోవాలని ఏసీపీ సూచించారు. షార్ట్‌సర్క్యూట్ నివారణకు నాణ్యమైన విద్యుత్ తీగలు, పరికరాలను వినియోగించాలని తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి మండపం వద్ద తగిన అగ్నిమాపక పరికరాలతోపాటు నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని స్పష్టం చేశారు. గణేష్ మండపాల వద్ద భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండపంలో ఇద్దరు నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మండపం వద్ద నోటీసు బోర్డు, పాయింట్ బుక్ ఏర్పాటు చేసి నిర్వాహకుల సంప్రదింపు వివరాలను అందులో పొందుపర్చాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని ఏసీపీ వసుంధరా యాదవ్ స్పష్టం చేశారు. రెండు మైకులతో కూడిన స్పీకర్లను మాత్రమే నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని, ధ్వని స్థాయి ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా ఉండాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మైక్ సౌండ్ సిస్టమ్ వినియోగించాలని తెలిపారు. అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. మండపాల వద్ద అసభ్యకరమైన నృత్యాలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఏసీపీ సూచించారు. పోలీసులు సూచించిన మార్గాలు, సమయాలను తప్పనిసరిగా పాటించాలని, ఊరేగింపులో పాల్గొనే వారు క్రమశిక్షణతో వ్యవహరించేలా నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలు, నీట మునిగే ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి, సమస్య లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడంలో మండపాల నిర్వాహకుల పాత్ర కీలకమని ఏసీపీ పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సత్తుపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి, మహిళా ఎస్‌ఐలు కవిత, హరిత, ఎస్‌ఐలు అశోక్, ప్రదీప్, పోలీస్ సిబ్బంది, సత్తుపల్లి మండలంలోని గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.


Comments