సమానత్వం, సమాజహితమే ఎమ్మార్పీఎస్ ఆశయం.
కొమ్ము చెన్న కేశవులు వనపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్.
పెద్దమందడి,సెప్టెంబరు07(తెలంగాణ ముచ్చట్లు):
సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపుమాపి సమానత్వం సాధించడమే ఎమ్మార్పీఎస్ ఆశయమని ఎమ్మార్పీఎస్ వనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్ము చెన్నకేశవులు మాదిగ అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.పెద్దమందడి మండలం గట్ల ఖానాపురం గ్రామంలోని సామాజిక భవనంలో సీనియర్ నాయకులు కృష్ణయ్య మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల నూతన గ్రామ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రారంభమైన ఉద్యమం అనేక సామాజిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసిందన్నారు. అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం యువతరం ఉద్యమంలోకి వచ్చి సమాజం కోసం పోరాడాలని కోరారు. దోపిడీ, వివక్ష, పీడన, అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ముందుకు సాగుతోందన్నారు.అనంతరం పెద్దమందడి మండలం గట్ల ఖానాపురం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా గుర్రాల చంద్రాయనాయుడు మాదిగ, అధికార ప్రతినిధిగా ఇంటివెంకి నాగరాజు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు మాదిగలను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు.


Comments