ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడులు.
గంగారంలో రైతులకు అవగాహన కల్పించిన కేవీకే శాస్త్రవేత్త విజయ్.
వీణవంక, సెప్టెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేందుకు రైతులు ఆధునిక సాగు పద్ధతులను పాటించాలని కేవీకే శాస్త్రవేత్త విజయ్ సూచించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన పంటల సాగు విధానాలపై రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ విధానాలు, తక్కువ నీటితో వరి సాగు చేసే పద్ధతులపై శాస్త్రీయ అవగాహన కల్పించారు. యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటల ఎంపిక, నీటి యాజమాన్యం, సాగు విధానాల్లో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గణేష్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రవణ్, ఏటీఎం స్రవంతి, రైతులు పాల్గొన్నారు.


Comments