హామీలు అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేశారు.
1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా వనపర్తిలో విద్యార్థుల నిరసన ర్యాలీ.
వనపర్తి,సెప్టెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌వీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం వనపర్తిలో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా హేమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు ద్విచక్ర వాహనాలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువజన కమిషన్, రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.విదేశీ విద్యకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, ఫీజు తిరిగి చెల్లింపులు, పెండింగ్ ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని కోరారు.యువజన ప్రకటనలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు తిరిగి చెల్లింపులను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ వనపర్తి ఇన్‌చార్జి సూర్యవంశం గిరి, బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమాల ఇన్‌చార్జి సునీల్ వాల్మీకి, శివ గౌడ్, సిరివాటి శంకర్, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, యువజన నాయకులు, బీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌వీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments