విద్య, ఉద్యోగ హక్కుల కోసం మాలల సమరభేరి.
ఆగస్టు 31న చలో సెక్రటేరియట్.
శంకరపట్నం, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు):
మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన విద్యా, ఉద్యోగ అవకాశాలు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆరోపించారు. మాలలకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్ అమలులోనూ అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99లో రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని మేడి అంజయ్య తెలిపారు. 20 రోస్టర్ పాయింట్లలో మాలలకు రెండు పాయింట్లు కేటాయించి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలులో మాలల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
మాలల విద్యా, ఉద్యోగ హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 31న హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద నిర్వహించే ‘చలో సెక్రటేరియట్’కు మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మాలల ఐక్యతను చాటుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్ మాట్లాడుతూ మాలల సమస్యల పరిష్కారం కోసం జాతీయ మాల మహానాడు నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. ప్రతి మాల కుటుంబం నుంచి ప్రతినిధులు పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా గొంతు వినిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు దామెర సత్యం, మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ లింగం కుమార్, మండల నాయకులు బక్కి రాజనర్సు, ఖమ్మం జయరాములు, డా. బక్కి శ్రీనివాస్, కాపర్తి శ్రీధర్, బక్కి అశోక్, కత్తెరమల్ల ఉదయ్‌కిరణ్, బక్కి వెంకటేష్, గునిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments