ఫాదర్ కొలంబో స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘన్‌పూర్, ఆగస్టు 15 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఫాదర్ కొలంబో స్కూల్‌లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఫాదర్ జి. ప్రకాశ్ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల ప్రతినిధులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరస్పాండెంట్ ఫాదర్ వై. థామస్ కిరణ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు దేశం పట్ల బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాగత నృత్యంతో పాటు వివిధ తరగతుల విద్యార్థులు దేశభక్తి నృత్యాలు, ప్రసంగాలు, గీతాలు, నాటికలను ప్రదర్శించారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు దేశభక్తిని ప్రతిబింబించే వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.విద్యార్థులు ‘సారే జహాన్ సే అచ్చా’, ‘వందే మాతరం’ తదితర దేశభక్తి గీతాలను ఆలపించి జాతీయ స్ఫూర్తిని చాటారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ముఖ్య అతిథి ఫాదర్ జి. ప్రకాశ్ ప్రదీప్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహనీయుల త్యాగాలు ఉన్నాయని, విద్యార్థులు స్వాతంత్ర్య విలువలను గౌరవిస్తూ ఐక్యత, క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు.కార్యక్రమం ముగింపులో ఉపాధ్యాయురాలు అనిత కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments