వంగరలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
భీమదేవరపల్లి, ఆగస్టు 15(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి నర్సింహరావు స్వస్థలం వంగర గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశం కోసం ఐక్యంగా నిలవాలని కోరారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కుల సంఘాల నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.


Comments