ఆంజనేయ స్వామి ఆలయానికి బండారి కుటుంబం చేయూత.
పెద్దమందడి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నీటి సంపును ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన నీటి మోటారు, పైపులను కీర్తిశేషులు బండారి సవరయ్య కుమారుడు బండారి పెద్ద నరసింహ వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో విరాళంగా అందించారు.ఆలయానికి వచ్చే భక్తులకు నీటి సదుపాయం కల్పించేందుకు తమ వంతు సహకారం అందించడం ద్వారా బండారి కుటుంబం భక్తి, సేవాభావం, దాతృత్వానికి ఆదర్శంగా నిలిచిందని ఆలయ అర్చకులు శివకుమార్ స్వామి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలగనుందని పేర్కొన్నారు.ఆలయ అభివృద్ధికి భక్తులు అందించే సహకారం ఆధ్యాత్మిక సేవతో పాటు సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా బండారి పెద్ద నరసింహ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, నరేష్, గుడిబండ శ్రీనివాస్ రెడ్డి, శాంతయ్య, రఘువర్ధన్ రెడ్డి, సత్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Comments