తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
- రెండు దశాబ్దాల సాహిత్య సేవలకు గుర్తింపు.
- రాష్ట్ర కార్యవర్గంలో చోటు.
సత్తుపల్లి, ఆగస్టు 3 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారికి తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించింది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఈ సంస్థ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా, గీతాకుమారికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిన గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలందించి ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారాన్ని అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాహిత్య సేవను కొనసాగిస్తూ కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సాహిత్య వేదికల నిర్వాహకురాలిగా విశేష గుర్తింపు పొందారు. వచన కవిత్వం, ఇష్టపదులు, బాలసాహిత్యం, గేయరచన, వ్యాసాలు, కథలు, గజల్‌లు, పలు లఘు సాహిత్య ప్రక్రియల్లో ఆమె రచనలు విశేష ఆదరణ పొందుతున్నాయి. వివిధ పత్రికలు, సాహిత్య వేదికలు, వాట్సాప్ సమూహాల ద్వారా సాహిత్యాభిమానులకు చేరువవుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సాహిత్య సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బిరుదులు అందుకుని సత్తుపల్లి ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి, ప్రధాన కార్యదర్శి బుర్ర మధుసూదన్ రెడ్డికి బత్తిన గీతాకుమారి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య వికాసం కోసం తన వంతు బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు.


Comments