జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
జమ్మికుంట/ఇల్లంతకుంట ఆగస్టు 02 (తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కరీంనగర్ జిల్లా శాఖ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాలతో పాటు కమలాపూర్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టా భూములు మంజూరు చేయించామని గుర్తు చేశారు.
హుజూరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన భూములపై కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టును ఆశ్రయించడం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఆ భూములను తిరిగి జర్నలిస్టులకు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అవసరమైనంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
కొంతమంది జర్నలిస్టులకు పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ సాయాన్ని తానే స్వయంగా అందిస్తానని హామీ ఇచ్చారు. విలేకరులకు ఎలాంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని కొనియాడిన ఎమ్మెల్యే, వారి సంక్షేమం కోసం తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని పేర్కొన్నారు.


Comments