రైతులు నీటి నిల్వకుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
పెద్దమందడి ఎంపీడీవో పరిణత.
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు):
కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు తమ వ్యవసాయ భూముల్లో నీటి నిల్వకుంటలను ఏర్పాటు చేసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీడీవో పరిణత సూచించారు. పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో రైతులకు నీటి సంరక్షణ, పంట మార్పిడి విధానాలపై అవగాహన కల్పించారు.వర్షాకాలంలో కురిసే నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకునేందుకు రైతులు తమ పొలాల్లో నీటి నిల్వకుంటలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నీటి నిల్వకుంటల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా నీటి కొరత సమయంలో పంటలకు అవసరమైన నీటిని అందించవచ్చని వివరించారు.జలసిరి పథకంలో భాగంగా 20×20 పరిమాణంలో నీటి నిల్వకుంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. నీటి నిల్వకుంటల ఏర్పాటు ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడటంతో పాటు, పశువులకు నీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు.ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా, తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవడంతో పాటు సాగు వ్యయాన్ని కూడా నియంత్రించవచ్చని తెలిపారు.రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, నీటి పొదుపు పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీడీవో పరిణత కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లికార్జున్, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అశోక్, ఐకెపి సిబ్బంది, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments