విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికీ రోడ్డు భద్రత సందేశం.
డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ.
ఎల్కతుర్తి, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తిలోని సెయింట్ థామస్ హైస్కూల్లో బుధవారం రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో టూ వీలర్ హెల్మెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి (డీటీఓ) అఫ్రీన్ సిద్ధిఖీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వైష్ణవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీటీఓ అఫ్రీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, విద్యార్థులే రోడ్డు భద్రతకు నిజమైన రాయబారులని అన్నారు. పాఠశాలలో నేర్చుకున్న రోడ్డు భద్రతా నియమాలను ప్రతి విద్యార్థి తమ ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్ కేవలం చట్టం కోసం కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో తరచూ నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ కుటుంబ సభ్యులకు తెలియజేసి ప్రతి ఇంటికీ రోడ్డు భద్రత సందేశాన్ని చేరవేయాలని కోరారు. ప్రభుత్వం, రవాణా శాఖ సంయుక్తంగా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తే సమాజంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలకు సెయింట్ థామస్ హైస్కూల్ యాజమాన్యం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మర్రి అశోక్, వైస్ ప్రిన్సిపల్ లింగం మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి, ఉపాధ్యాయులు లావణ్య, సరిత, సురేష్, ఆశా బేగం, రమేష్, సుమలత, లత, కృష్ణ, కవిత, కళ్యాణి, స్వప్న తదితరులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, హెల్మెట్ వినియోగంపై తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Comments