కులం పేరుతో దూషించి దాడి చేసిన 11 మందికి ఏడాది జైలు శిక్ష...
మహబూబ్‌నగర్,15(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఓ రిపోర్టర్‌పై కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన కేసులో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విచారించిన న్యాయస్థానం 11 మంది నిందితులను దోషులుగా తేల్చి, ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది.2021లో అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని సంబంధిత అధికారులకు సమాచారం అందించిన రిపోర్టర్‌పై నిందితులు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, వాదనలను పరిశీలించిన అనంతరం నిందితులపై నమోదైన అభియోగాలు రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది.బాధితుడిపై కులం పేరుతో దూషించడం, దాడికి పాల్పడటం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.ఈ తీర్పుతో బాధితుడికి న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు. అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులపై దాడులు, అలాగే ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల కేసుల్లో చట్టం కఠినంగా అమలవుతుందనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Comments