యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి.
సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్.
వనపర్తి,జూలై16(తెలంగాణ ముచ్చట్లు):
స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు చేయూత అందించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించవచ్చని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.వనపర్తి పట్టణంలో శివరాజ్, నర్సింహ స్వామి, భానుప్రకాష్ సంయుక్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వదేశీ మార్ట్ దుకాణాన్ని ఆయన సందర్శించి అభినందించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ముగ్గురు యువకులు కలిసి స్వయం ఉపాధి లక్ష్యంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టి "స్వదేశీ మార్ట్"ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఖాదీ ఉత్పత్తులు, స్వదేశీ వస్తువులు, సేంద్రియ ఆహార పదార్థాలు, ఆర్గానిక్ ఫుడ్స్ విక్రయించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమన్నారు.ప్రతి ఒక్కరూ ఖాదీ, స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని, సేంద్రియ ఆహారాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ప్రస్తుతం యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తాము ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సామాజికవేత్త గంధం నాగరాజు, శ్రీనివాస్, శివరాజ్, నర్సింహ స్వామి, శేఖర్ ,భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Comments