విశ్వకర్మల సామూహిక బంద్‌కు పిలుపు.
సమస్యల పరిష్కారం, కొత్త ధరల అమలు కోసం మూడు రోజుల ఆందోళన.
హుజూరాబాద్, జూలై 17(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రస్తుత జీవన విధానంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుండటం, కార్పొరేట్ కంపెనీల పోటీ కారణంగా విశ్వకర్మ కులవృత్తిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశ్వకర్మ మనుమయ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
హుజూరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం పట్టణ అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశ్వకర్మల సమస్యల పరిష్కారం, సంఘ అభివృద్ధి, వృత్తి పనుల రేట్ల పెంపు కోసం ఈ నెల జూలై 18 (శనివారం) నుంచి 20 (సోమవారం) వరకు మూడు రోజుల పాటు సామూహిక బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
హుజూరాబాద్ పట్టణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానం చేసినట్లు తెలిపారు. బంద్ తొలి రోజు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ నిర్ణయించే నూతన ధరల పట్టికను అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అలాగే బంద్ ముగింపు రోజైన జూలై 20న విశ్వకర్మల సమస్యలపై శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సంఘ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఎవరైనా పనులు చేపడితే సంఘ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు హెచ్చరించారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు రావుల వేణు, రాంపల్లి భిక్షపతి, బాణాల వివేకానంద చారి, పంచాకొత్త సత్యనారాయణ, ఎదులాపురం సదానందం, సజ్జన్నాపు రవీందర్, చల్లూరి రమేష్, ఉప్పాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments