జమ్మికుంటలో హోటళ్లకు హెచ్చరిక.. నాణ్యత, పరిశుభ్రతపై రాజీ లేదు.
ప్లాస్టిక్ రహిత జమ్మికుంటకు సహకరించండి.
జమ్మికుంట టౌన్ జూలై 08 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రతి హోటల్, రెస్టారెంట్, కర్రీ పాయింట్ యజమాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.
బుధవారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్ల యజమానులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండటంతో పాటు రైల్వే, బస్సు రవాణా, వ్యవసాయ మార్కెట్ వంటి సౌకర్యాల కారణంగా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణానికి వస్తుంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆహార విక్రయ కేంద్రాలు పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి జూట్ బ్యాగులను ప్రోత్సహించాలని, వినియోగదారుల్లో కూడా అవగాహన కల్పించాలని కోరారు. అలాగే అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మున్సిపల్ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బోళ్ళ సదానందం తదితరులు పాల్గొన్నారు.


Comments