ఆలయ భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యం.
శ్రీ పశుపతినాథ్ దేవస్థానం భూములకు రక్షణ కల్పించాలని అడిషనల్ కలెక్టర్ ఎన్ రవికుమార్ కు వినతి.
ఎల్కతుర్తి ,జూలై 3 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయ ఆస్తులు క్రమంగా అన్యాక్రాంతమవుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ ఎన్. రవికుమార్‌కు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దాదాపు నాలుగేళ్ల క్రితం దేవస్థానానికి 1.25 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ భూమికి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పలుమార్లు అధికారులు స్థలాన్ని పరిశీలించినా భూమి పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
దీని ఫలితంగా ఆలయ భూమిలో వెటర్నరీ ఆసుపత్రి, వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్, అంగన్‌వాడీ కేంద్రం తదితర ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు ఏర్పడ్డాయని, విచారణల్లో ఈ అంశాలు గుర్తించినప్పటికీ సంబంధిత శాఖలు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులోని అక్షరాలు పూర్తిగా చెరిగిపోవడంతో ఆలయానికి చెందిన భూమి వివరాలు ప్రజలకు తెలియకుండా పోయాయని, సంబంధిత ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని కమిటీ సభ్యులు ఆరోపించారు.
ఆలయ భూములకు వెంటనే శాశ్వత హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డును పునరుద్ధరించి, ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌ను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments