జమ్మికుంటలో వింత చర్మవ్యాధులతో వీధి కుక్కల సంచారం.. ప్రజల్లో భయాందోళన.
జమ్మికుంట టౌన్ జులై 03 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో వింత చర్మవ్యాధులతో బాధపడుతున్న వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడం, చర్మం ముడతలు పడటం, బలహీనంగా కనిపించడం వంటి లక్షణాలతో పలుచోట్ల కుక్కలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు, విద్యాసంస్థల సమీపంలో ఇవి సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ కుక్కలు ఏదైనా అంటువ్యాధితో బాధపడుతున్నాయా? లేదా చర్మవ్యాధి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. కొన్ని కుక్కలు తీవ్రమైన అనారోగ్యంతో నీరసంగా కనిపిస్తుండగా, మరికొన్ని ఆహారం కోసం ఇళ్ల పరిసరాల్లో తిరుగుతున్నాయి. దీంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జంతు సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ కుక్కలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు వీధి కుక్కల నియంత్రణ, స్టెరిలైజేషన్, టీకాల కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చకముందే సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Comments