ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.
స్మార్ట్ రేషన్ కార్డులతో పేదలకు మరింత మెరుగైన సేవలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. వనపర్తి జిల్లాలో 1,83,013 స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందులో అర్హులైన కుటుంబాలకు కొత్తగా 26,465 కార్డులు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడంతో పాటు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పంట రుణాల మాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గుడిసెలు లేని వనపర్తిని నిర్మించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.2 వేల కోట్ల నిధులతో వివిధ పనులు చేపట్టామని పేర్కొన్నారు.మహిళా సాధికారత, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వనపర్తి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పౌరసరఫరాల డీఎం ఆంజనేయులు, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


Comments