ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి.
- రూ.3,573 కోట్లతో 165 కి.మీ. హైటెక్ రహదారి పూర్తి.
- మంత్రి తుమ్మల స్వయంగా ప్రయాణించి పరిశీలన.
- హైదరాబాద్–ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయానికి భారీ తగ్గింపు.
- రైతులు, స్థానికులకు ఉపాధి.. రవాణాకు కొత్త ఊతం.
సత్తుపల్లి, ఆగస్టు 2 (తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే రాకపోకలకు సిద్ధమైంది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదంతో రూ.3,573 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై అధికారులు ఆగస్టు 1 నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం స్వయంగా హైవేపై ప్రయాణించి పరిస్థితులను పరిశీలించారు. తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఈ ప్రాజెక్టుకు రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల, 2017 నుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చలు జరిపి ప్రాజెక్టుకు ఆమోదం తీసుకురావడంతో పాటు, అప్పటి కేంద్ర రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ (ఐఏఎస్) సహకారంతో డీపీఆర్ సిద్ధం చేయించారు. అనంతరం 2018 నాటికే భూసేకరణ పూర్తిచేయించి, టెండర్ల ప్రక్రియ నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ధ్వంసలాపురం, కల్లూరు, వేంసూరు ప్రాంతాల్లో అదనపు ఎగ్జిట్ పాయింట్ల కోసం ప్రత్యేకంగా కృషి చేసి మంజూరు చేయించారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులకు హైవే ప్రయోజనాలు మరింత చేరువయ్యాయి. స్థానికులు మంత్రి తుమ్మల కృషిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌మాల ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా నిర్మించిన ఈ హైవే ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు 165 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో తెలంగాణలో 90 కి.మీ., ఆంధ్రప్రదేశ్‌లో 75 కి.మీ. ఉన్నాయి. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం తగ్గింది. దాదాపు 56 కిలోమీటర్ల దూరం ఆదా కావడంతో పాటు, సూర్యాపేట నుంచి రాజమండ్రికి చేరుకునే ప్రయాణ సమయం నాలుగు నుంచి ఆరు గంటల నుంచి రెండున్నర గంటలకు తగ్గనుంది. ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ బెంగాల్ దిశగా కూడా రవాణా అనుసంధానం మరింత మెరుగుపడనుంది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేగా రూపొందిన ఈ రహదారిపై నిర్ణీత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ద్వారానే వాహనాలకు అనుమతి ఉంటుంది. ప్రయాణించిన దూరానికి అనుగుణంగా టోల్ వసూలు చేసే క్లోజ్డ్ టోలింగ్ విధానం అమల్లోకి వచ్చింది. భద్రత కోసం అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం, ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీల సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఓపెనింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి నేరుగా చలాన్లు జారీ చేయనున్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. పచ్చని పంట పొలాల మధ్యుగా సాగే ఈ హైవే రైతులు, స్థానికులకు కూడా వరంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైవే వెంట పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దశాబ్దకాలంగా ఈ ప్రాజెక్టు కోసం చేసిన కృషి ఫలించిందన్నారు. తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ హైవే కేవలం ఒక రహదారి మాత్రమే కాదని, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసే అభివృద్ధి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


Comments