సోయం రాజాబాబుకు తుది వీడ్కోలు.. నివాళులతో పోటెత్తిన రాజకీయ నేతలు.
- మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భావోద్వేగం.
- తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నివాళి.
- బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పరామర్శ.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
దమ్మపేట, జూలై 20 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోయం రాజాబాబు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు రాజాబాబు నివాసానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామాభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి రాజాబాబు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు కూడా నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. రాజాబాబు మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం తదితరులు ఆయన వెంట ఉన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజాబాబు పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని వారికి సూచించారు. అన్నపురెడ్డిపల్లి మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకురాలు సున్నం లలిత కూడా పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజాబాబు మరణం గ్రామానికే కాక పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు సోయం వీరభద్రం, గురుమూర్తి, చాప రాఘవయ్య, పాయం సూర్యం, వంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రాజాబాబు పార్థివదేహానికి నివాళులు అర్పించారు.


Comments