వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
జమ్మికుంట టౌన్ జులై 17 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం రంగమ్మపెల్లి గ్రామంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ మహిళలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని సుమారు 200 మంది మహిళలు ఇంటికొక బిందెడు నీటిని తీసుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గ్రామ దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎల్లమ్మ తల్లి, భూలక్ష్మి, బీరన్న, పోచమ్మ, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో గ్రామదేవతలకు నీరాభిషేకాలు చేసి భక్తి గీతాలు ఆలపిస్తూ వర్షాలు కురవాలని ప్రార్థించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, బావులు, చెరువులు నీటితో కళకళలాడాలని, రైతుల కష్టాలు తొలగించి వానదేవుడు కరుణించాలని మొక్కులు చెల్లించుకున్నారు.
వర్షాలు లేక ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఆందోళన చెందుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసి గ్రామంలో సుభిక్షం నెలకొనాలని గ్రామదేవతలను వేడుకుంటూ ఆటలు, పాటలతో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.


Comments