ఈశ్వరమ్మ యాదవ్ అవమానంపై బీసీ జేఏసీ ఆగ్రహం.
*దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్‌లో ధర్నా*
హుజూరాబాద్, జూలై 17(తెలంగాణ ముచ్చట్లు ):
యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్‌ను కులపరంగా దూషించిన వ్యక్తిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీలపై సామాజిక వివక్ష, కులపరమైన అవమానాలు కొనసాగుతుండడం బాధాకరమని అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యురాలిగా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో తన పేరు లేదనే కారణంతో శివచరణ్ రెడ్డి ఆమెపై దుర్భాషలాడడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.
కులపరంగా అవమానించే వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొడతాయని, నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా ముందుకు వచ్చినప్పుడే సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.
ఈ ధర్నాలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వన్నాల శివాజీ, ఇప్పకాయల సాగర్, మావునూరి ప్రవీణ్ కుమార్, దేవసాని ప్రియదర్శిని, కొలిపాక క్రాంతి, అక్కినేపల్లి ప్రవీణ్ కుమార్, రామ్ సారయ్య, గడప రాజు, మేకల రవి, దొంత హరికిషన్, సొల్లు శంకర్, ఊదారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments