డ్రగ్స్ నిర్మూలనపై కల్లూరు పోలీసుల ప్రత్యేక దృష్టి.
- పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, విద్యాసంస్థల పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు.
- సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతాం.
- ఎస్సై హరిత.
సత్తుపల్లి, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు): 
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కల్లూరు పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై హరిత ఆధ్వర్యంలో శుక్రవారం పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి, నిషేధిత మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్సై హరిత మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతర తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, నిల్వ, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఎస్సై హరిత పిలుపునిచ్చారు.


Comments