ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు శాశ్వత గూడు.
23 మంది లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
పెబ్బేరు,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):
పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తండా, రంగాపురం గ్రామాల్లో మంగళవారం 23 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై, నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.కొత్త ఇంటిలో అడుగుపెట్టిన లబ్ధిదారులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా పూరి గుడిసెలు, రేకుల ఇళ్లలో పాములు, తేళ్లు, విషపురుగుల భయంతో జీవించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొంతింటి కల నెరవేరిందని వారు తెలిపారు. గత పాలకులు తమ సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని, తమ కుటుంబాలకు భద్రత, గౌరవం కల్పించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాపర్ల రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సురేందర్ గౌడ్, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments