నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.
ప్రకృతి విపత్తుల చట్టం కింద పరిహారం కోరిన సీపీఎం.
వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. ప్రకృతి విపత్తుల చట్టం కింద బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వేంసూరు తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీఎం నాయకుడు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తహశీల్దార్ జె.మాణిక్‌రావుకు వినతిపత్రం అందజేశారు. జూన్ 10న మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ధాన్యంతో పాటు గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నాయి. మర్లపాడు గ్రామం సమీపంలోని దళితవాడలో నివసిస్తున్న సాధు నాగదివ్య–శరత్‌బాబు, సాధు సరోజినీ–ఇస్త్రయ్య, సాధు ఝాన్సీ–వెంకటేశ్వరరావు, రావూరి హేమలత–నాగేష్ కుటుంబాల రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు వర్షానికి తడిసి పాడయ్యాయని తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. నష్టపోయిన కుటుంబాలకు జాతీయ, రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిబంధనల మేరకు తక్షణ పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకుడు సాధు శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments