ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం...
–రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం బ్యూరో , జూన్ 10(తెలంగాణ ముచ్చట్లు )
ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
బుధవారం ఖమ్మం నగరంలోని ఎఫ్‌సీఐ గోదాం నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.3 కోట్ల 5 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ఇంట్లో కూడా అన్ని పనులను ఒకేసారి చేయలేమని, అదే విధంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు కొత్త ఇళ్ల మంజూరుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు.
గతంలో మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రతిరోజూ తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్నేరు వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, రోడ్లు, డ్రెయిన్ల నాణ్యతపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే ప్రజల ఆదాయం ఆసుపత్రులకే వెచ్చించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరం లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతోందని, రోడ్ల విస్తరణ, జాతీయ రహదారుల నిర్మాణంతో వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. మున్నేరు వరదల నేపథ్యంలో రూ.600 కోట్లతో రిటైనింగ్ వాల్ ప్రాజెక్టుకు మంత్రి కృషి చేశారని, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.వెలుగుమట్ల అర్బన్ పార్కును హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపే కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఖమ్మం ఖిల్లా రోప్‌వే ప్రాజెక్టు అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నా యని తెలిపారు. నగర సుందరీకరణ, పచ్చదనం పెంపుపై మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు.
ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌లో మెరుగైన రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా పాలనలో గత రెండున్నర సంవత్సరాలుగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన అందించి ఆదాయ వనరులు కల్పిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి డివిజన్‌లో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments