అశ్వారావుపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం.
- ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.
- లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.
- పలు రోడ్లు, యంగ్ ఇండియా పాఠశాల, ఎకో పార్క్ నిర్మాణాలకు శంకుస్థాపన.
అశ్వారావుపేట, జూన్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. దమ్మపేట మండలంలోని కట్కూరు, వీరభద్రునిగుంపు, పట్వారిగూడెం, ముద్దులగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. పట్వారిగూడెంలో రాజుపల్లి గ్రామానికి చెందిన 38 మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం రూ.2.22 కోట్లతో పట్వారిగూడెం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి పాకలగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ.1.93 కోట్లతో మద్దులగూడెం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి రెడ్డాలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ నిర్మాణ పనులతో పాటు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మామిళ్లవారిగూడెం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేర ప్రయోజనం కల్పించామని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 4,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 99 యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని అన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. అశ్వారావుపేటకు 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, ఏటీసీ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments