రక్తదానంలో ఆదర్శంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సేవలను గుర్తిస్తూ రెడ్‌క్రాస్ సంస్థ అందించిన ప్రశంసా జ్ఞాపికను తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డికి అందజేశారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో అత్యధికంగా రక్తాన్ని సేకరించేందుకు కృషి చేసి, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ సేవలను గుర్తించిన రెడ్‌క్రాస్ సంస్థ తరఫున గవర్నర్ అందించిన ప్రశంసా జ్ఞాపికను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వనపర్తిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రక్తదానం ఒక మహత్తర సామాజిక సేవ అని, ఒక్కరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెట్టగలదని పేర్కొన్నారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ, వనపర్తి మున్సిపల్ చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.


Comments