సాగునీటిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం.
పెద్దమందడి కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,ఆగస్టు09(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీశైలం నుంచి కేఎల్‌ఐ ద్వారా వనపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సాగునీటిని అందిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సాగునీటి విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం పెద్దమందడి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి కేఎల్‌ఐ ద్వారా సాగునీటిని విడుదల చేసి వనపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు.పంపులు ప్రారంభమైన విషయం బీఆర్‌ఎస్ నాయకులకు కూడా తెలుసని కాంగ్రెస్ నాయకులు అన్నారు. పంపులు ప్రారంభించిన వెంటనే కాలువలకు నీరు చేరదని, పంపులు ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 15 రోజులకు సాగునీరు అందుతుందనే విషయం బీఆర్‌ఎస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా సాగునీటిపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా దుష్ప్రచారమేనని విమర్శించారు.వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులను ఆందోళనకు గురిచేసేలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, సాగునీరు అందించే విషయంలో ప్రజా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, పెద్దమందడి , ఖిల్లా గణపురం మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, పెద్దమందడి సర్పంచ్ సూర్య గంగా రవి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments