చాముండి ఇండస్ట్రీస్ రైస్‌మిల్‌కు కూల్చివేత నోటీసు.
అనుమతులు,ఎన్‌ఓసీ లేకుండా నిర్మాణం.. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం.
పెద్దమందడి,ఆగస్టు09(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎం/ఎస్. చాముండి ఇండస్ట్రీస్ రైస్‌మిల్‌కు సంబంధించిన అనధికారిక భవనంపై గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేత నోటీసు జారీ చేశారు. భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ పర్మిషన్, ఎన్‌ఓసీ పొందలేదని నోటీసులో పేర్కొన్నారు.వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని సర్వే నం. 327 ఏ ఏ/2లో చాముండి ఇండస్ట్రీస్ రైస్‌మిల్ ఉన్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. సంబంధిత భవనానికి సంబంధించిన పత్రాలను సమర్పించడంతో పాటు ఆస్తి పన్ను చెల్లించాలని గతంలో జూలై 1న నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జూలై 22న తదుపరి నోటీసు, ఆగస్టు 1న తుది నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.
*
ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి సంబంధిత భవనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు సమర్పించలేదని, లిఖితపూర్వక వివరణ కూడా ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న కూల్చివేతకు ముందు వివరణ కోరుతూ తాజా నోటీసు జారీ చేశారు.
*7 రోజుల్లో సమాధానం ఇవ్వాలి*
నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోగా అనధికారిక భవనాన్ని గ్రామ పంచాయతీ ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. నిర్ణీత గడువులో వివరణ ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోయినా అమలులో ఉన్న నిబంధనల ప్రకారం అనధికారిక భవనాన్ని కూల్చివేసే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
*ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా చర్యలు*
వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వారి మౌఖిక ఆదేశాలతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన జి.ఓ.ఎం.ఎస్. నం.52 (12-03-2022), జి.ఓ.ఎం.ఎస్. నం.67 (26-02-2002), జి.ఓ.ఎం.ఎస్. నం.168 (07-04-2012)తో పాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018ను ఆధారంగా చేసుకుని నోటీసు జారీ చేసినట్లు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు.


Comments