హుజురాబాద్ అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమీక్ష.
*ఇసుక, యూరియా, సాగునీరు సమస్యలపై అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు*
హుజురాబాద్, ఆగస్టు 6 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్ మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. గురువారం హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులతో సమావేశం నిర్వహించి మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్షించారు.
వ్యవసాయం, హార్టికల్చర్, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ, ఉపాధి హామీ, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇసుక కొరతపై ఆగ్రహం
మండలంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే ఆర్డిఓ అధికారితో మాట్లాడారు. స్థానిక అవసరాల కోసం నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు పట్టణాల పరిధిలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆన్‌లైన్ ఇసుక బుకింగ్ విధానంలో రెండు నిమిషాలు కూడా అవకాశం దొరకడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రూ.పదిహేను వందలకు లభించాల్సిన ఇసుక రూ.ఏడువేల అయిదు వందలు వరకు అధిక ధరలకు విక్రయించడం బాధాకరమన్నారు.
యాప్ ద్వారా కాకుండా షాపుల వద్దనే యూరియా ఇవ్వాలి
రైతులకు యూరియా అందించడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా షాపుల వద్దనే యూరియా అందించే విధానం అమలు చేయాలని సూచించారు. అవసరమైన సమయంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపాలి
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీటి ఎత్తిపోతల విషయంలో ఇబ్బందులు వస్తే ఇరవై తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామాకు సిద్ధమని తెలిపారు.
విద్యుత్ సరఫరాపై ప్రశ్నలు
ప్రభుత్వం ఇరవైనాలుగు గంటల విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పన్నెండు గంటలే సరఫరా అవుతోందని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతులు, ప్రజలకు నిరంతర విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలపై దృష్టి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ , ఎంపీడీఓ, ఎంఆర్ఓ , వివిధ శాఖల అధికారులు, మండల సర్పంచులు పాల్గొన్నారు.


Comments