తెలంగాణ భావజాలానికి చిరునామా జయశంకర్ సార్: మొలుగు ప్రశాంత్ కుమార్.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 06 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాది వేసి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నంతా అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అన్నారు.
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పుట్టుక నీది... చావు నీది... బతుకంతా తెలంగాణది" అనే సిద్ధాంతాన్ని తన జీవితమంతా ఆచరణలో పెట్టిన మహనీయుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసి, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్‌కు గురుతుల్యులైన ఆయన తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటికీ చేర్చారని అన్నారు.
తెలంగాణ చరిత్రలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments